నల్లధనాన్ని ప్రభుత్వమే ప్రోత్సహిస్తు౦ది: కేజ్రీవాల్
posted on Nov 10, 2012 @ 2:29PM
వారానికి ఒకరిపై అవినీతి ఆరోపణలు చేస్తున్న సామాజిక కార్యకర్త అరవింద్ కేజ్రీవాల్ మరో అవినీతి బాగోతాన్ని బయటపెట్టి సంచలనం సృష్టించారు. దేశంలో నల్లధనాన్ని ప్రభుత్వమే ప్రోత్సహిస్తున్నదని ఆయన విమర్శించారు. విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనంపై చర్చ జరుతోందిగానీ, ఆ మొత్తాన్ని వెనక్కి తెప్పించే ప్రయత్నాలు చేయడంలేదని ఆయన ధ్వజమెత్తారు.
స్విస్ బ్యాంక్‌లో 700 మంది భారతీయులకు ఎకౌంట్లు ఉన్నాయని చెప్పారు. వారికి రూ. 6000 కోట్లు విలువచేసే ఖాతాలు ఉన్నాయని, ఆ వివరాలు తమ వద్ద ఉన్నాయని కేజ్రీవాల్ తెలిపారు. జెనీవాలోని హెచ్ఎస్‌బీసీ పని తీరు చాలా దారుణంగా ఉందని కేజ్రీవాల్ విమర్శించారు. రూ. 25 లక్షల కోట్లు విదేశీ బ్యాంక్‌లో మూలుగుతున్నాయని, ఓ సీబీఐ మాజీ అధికారి చెప్పారని అన్నారు. ఆ రూ. 25 లక్షల కోట్లలో ఆరువేల కోట్ల రూపాయలకు సంబంధించిన సమాచారం తమ వద్ద ఉందంటూ, అందుకు సంబంధించిన ప్రతాలను కేజ్రీవాల్ మీడియా సమావేశంలో ప్రదర్శించారు.
ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీలు స్విస్ బ్యాంక్‌లో చెరో వంద కోట్లు జమచేశారని, వారి తల్లి కోకిలా బెన్‌కు కూడా స్విస్ బ్యాంక్‌లో ఎకౌంట్ ఉందని కేజ్రీవాల్ తెలిపారు. మరి ఆదాయపు పన్ను శాఖ అధికారులు వాళ్ళ నివాసాల్లో ఎందుకు సోదాలు చేయరని కేజ్రీవాల్ ప్రశ్నించారు. హవాలా వ్యాపారం జోరుగా సాగుతోందని, అందుకు హెచ్.ఎస్.బీ.సీ. అధికారులే సూత్రధారులని ఆయన మండిపడ్డారు. వారిపై చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.